𝗧𝗵𝗲 𝗠𝗮𝗴𝗶𝗰 𝗢𝗳 𝗥𝗲𝗮𝗹𝗶𝘁𝘆 - 𝗥𝗶𝗰𝗵𝗮𝗿𝗱 𝗗𝗮𝘄𝗸𝗶𝗻𝘀

మనిషి నిజంగానే కోతి నుండి వచ్చాడా? జీవ పరిణామం నిజమే అయితే మొదటి మానవుడు ఎవరు?

ఈ విషయం సులువుగా అర్ధంకావటానికి ప్రముఖ జీవపరిణామ శాస్త్రవేత్త రిచర్డ్ డాకిన్స్ తన 'మాజిక్ ఆఫ్ రియాలిటీ' గ్రంధంలో చెప్పిన ఒక "ఆలోచనా ప్రయోగాన్ని" మనం చేస్తున్నట్లు ఊహించే ప్రయత్నం చేయాలి.

మూడు మైళ్ళ పొడవాటి ఒక పుస్తకాల అర ఉంది అనుకుందాం.
మీరు ఆ మూడు మైళ్ళ పొడవాటి పుస్తకాల అరకు ఒక పక్కన ఉండి ఆ పుస్తకాల అలమరలో మీ ఫోటో ఉంచి, దాని వెనుక మీ తండ్రి ఫోటో, దాని వెనుక మీ తండ్రి యొక్క తండ్రి (తాత) ఫోటో, దాని వెనుక మీ న తాత యొక్క తండ్రి ఫోటో,............ ఇలా ఒకరి ఫోటో వెనుక వారి యొక్క తండ్రి ఫోటోను పేర్చుకుంటే ఆ పుస్తకాల అర అవతలి భాగానికి చేరుకున్నారు అనుకుందాం. 
(మూడు మైళ్ళు ఎందుకు అంటే సాధారణ ఫోటో కార్డ్ మందంలో ఉన్న 18కోట్ల 50లక్షల ఫోటోలను ఒకదాని వెనుక ఒకటి పేర్చితే సుమారుగా మూడు మైళ్ళ పొడవున్న వరుస తయారవుతుంది.)

మీ ఫోటోతో ఒక చివరన మొదలైన ఫోటోల వరుస మరొక పక్కకు చేరే సరికి మీ తండ్రికి తండ్రి, తాతకు ముత్తాతకు ముత్తాత ఇలా సాగుతూ అటు చివరకు వచ్చే సరికి ఆ మీకు 18కోట్ల 50లక్షల తరాల క్రితం ఉన్న పూర్వీకుడి ఫోటోతో ముగిసింది అనుకుందాం.
ఆ 18కోట్ల 50లక్షల తరాల క్రితం ఉన్న పూర్వీకుడు ఎలా ఉంటాడు అనుకుంటున్నారు? 
అది ఒక చెప! అవును, మీకు 18కోట్ల 50లక్షల తరాల క్రితం ఉన్న తాత, నాయనమ్మలు చేపలు.

ఇప్పుడు మీరు ఆ పొడవాటి పుస్తకాల అర వెంబడే నడక సాగిస్తూ, వరుసలో పేర్చి ఉన్న ఫోటోల నుండి ఒక్కోక్క ఫోటో తీసి చూస్తున్నారు అనుకుందాం. 
ప్రతి ఫోటోలోనూ ఆ ఫోటోకి ముందు మరియు వెనుకన ఉండే ఫోటోలలోని "ప్రజాతి"కి (species) చెందినవారే ఉంటారు. 
ప్రతి ఫోటోలోనూ ఉండేవారు వారి ముందు వెనుక ఫోటోలలో ఉన్నవారినే పోలి ఉంటారు. 
ఆ పుస్తకాల అరకు ఒక చివర నుండి మరొక చివరకు నడిచి వెళ్తే, ఒక చివరిలో మనిషి ఫోటో కనపడితే మరొక చివరిలో చేప ఫోటో ఉంటుంది.
మధ్యలో ఎంతో మంది ఆసక్తి కరమైన పూర్వీకులు కనపడతారు. తోక లేని కోతులు, కోతులు, సరీసృపాలు వగైరా.
ప్రతివారు తమ పొరుగు ఫోటోలలోని వారిని పోలే ఉంటారు, కానీ తమ మధ్య కొంత దూరాన్ని కలిగి ఉన్న రెండు ఫోటోలను తీసి చూస్తే ఆ ఫోటోలలోని వారికి ఏ పోలికా ఉన్నట్లు కనపడదు.

ఈ విషయం అర్ధం చేసుకోవటం అంత కష్టమైనదేమి కాదు. 
అతి సూక్ష్మమైన అడుగులతో సాగుతుండే క్రమక్రమమైన మార్పులు మనకి అనుభవంలోలేనివి కావు, మనకు వాటి గురించి తెలుసు. 
మీరు ఒకప్పుడు పసిబిడ్డగా ఉన్నారు, ఇప్పుడు అలా లేరు. కొన్నేళ్ళ తర్వాత వృద్ధులు అవుతారు, అప్పుడు వేరేలా ఉంటారు. 
అయినప్పటికీ ప్రతిరోజు ఉదయాన్నే నిద్రలేచినప్పుడు మీరు ముందు రోజు రాత్రి పడుకోబోయేముందు ఉన్నట్లే ఉంటారు. 
పొత్తిళ్ళలోని శిశువు చంటి బిడ్డగా మారుతుంది, చంటి బిడ్డ బాలుడుగా మారుతుంది, బాలుడు యువకుడు మారతాడు, యువకుడు మధ్య వయస్కుడిగా మారతాడు, మధ్య వయస్కుడు వృద్ధుడు అవుతాడు. ఈ మార్పు చాలా నిదానంగా క్రమక్రమంగా సాగుతూ ఉం'టుంది.
"ఆ చంటి బిడ్డ చంటి బిడ్డగా ఉండటం ఆగిపోయి, ఉన్నటుండి బాలుడు అయ్యాడు" లేదా "ఆ బాలుడు బాలుడిగా ఉండటం ఆగిపోయి, ఉన్నటుండి మధ్య వయస్కుడు అయ్యాడు" లేదా "ఆ యువకుడు యువకుడిగా ఉండటం ఆగిపోయి, ఉన్నటుంది వృద్ధుడు అయాడు" లాంటి విషయాలు ఎప్పుడు జరగవు.

మీ తల్లితండ్రులు, తాతలు, ముత్తాతలు ఇలా సాగుతూ చేపలా ఉండే 18కోట్ల 50లక్షల తరాల క్రితం ఉన్న పూర్వీకుడు వద్దకు తీసుకువెళ్ళే మన ఆలోచనా ప్రయోగాన్ని అర్ధం చేసుకోవటానికి పైన చెప్పుకున్న విషయం దోహదపడుతుంది.
అక్కడి నుండి కాలంలో ముందుకు సాగితే ఏం జరిగింది? ఆ చేపలా ఉన్న పూర్వీకుడికి చేపలా ఉండే బిడ్డ పుట్టి, ఆ బిడ్డకు కూడా చేపలా ఉనే బిడ్డ పుట్టి,......... ఆ బిడ్డకు __లా ఉండే బిడ్డ పుట్టి, 18కోట్ల 50లక్షల తరాల తర్వాత (క్రమంగా చేపలా కాకుండా) వచ్చేదే మీరు.

కాబట్టి ఇది చాలా నిదానంగా జరిగే ప్రక్రియ, దీన్ని మీరు గమనించలేరు. ఒక వెయ్యేళ్ళు వెనక్కి నడిచినా మీరు దీన్ని గుర్తించలేరు. 
పది వేల ఏళ్ళ వెనక్కి వెళ్ళినా, అంటే మన 400 తరాల క్రితపు పూర్వీకుడి వద్దకు వెళ్ళినా ఏవో అల్పమైన మార్పులు తప్ప ఏది గమనినించలేరు. ఆ అల్పమైన మార్పులు కూడా, అందరు ఒకేలా ఉండరు కాబట్టి కనపడతాయి కాని మీరు ఒక "మార్పు క్రమాన్ని" అయితే అప్పటికి కూడా గుర్తించలేరు. 
వస్త్రధారణ, రోమాలు లాంటి కొన్ని అల్పమైన బాహ్య లక్షణాలలో తప్ప పది వేల ఏళ్ళ క్రితపు పూర్వికుడు నేటి ఆధునిక మానవుడిలానే ఉంటాడు.

ఒక లక్ష సంవత్సరాల క్రితం ఉన్న 4,000 తరాల క్రితపు పూర్వీకుడు ఎలా ఉంటాడు?
ఇప్పుడైతే కొంత గమనించతగ్గ మార్పులు మనకు కనపడతాయి.
నేటికన్నా కొంత మందపాటి పుర్రె ఉంటుంది, ముఖ్యంగా కనుబొమ్మల క్రింద. అయినప్పటికీ ఇది అల్పమైన మార్పే.

ఇప్పుడు కాలంలో మరింత వెనక్కు వెళ్దాం. ఆ అర వెంబడే నడుస్తూ ఒక పది లక్షల సంవత్సరాల క్రితానికి వెళ్ళాం అనుకుందాం. అప్పుడు ఉండేది 50,000 తరాల క్రితపు పూర్వీకుడు. తనని మనది కాని వేరొక ప్రజాతిగా (species) గుర్తించేలా ఉంటాడతడు. తానే "హోమో ఎరక్టస్". మనమేమో "హోమో సేపియన్స్".

"హోమో ఎరక్టస్" మరియు "హోమో సేపియన్స్" కలిసి లైంగిక చర్యలో పాల్గొని సంతానోత్పత్తిని చెయ్యవు. అలా జరిగినప్పటికీ పుట్టే ఆ సంతానానికి, సంతానోత్పత్తిని చేసే సామర్ధ్యం ఉండదు. అచ్చం కంచరగాడిదలా. (కంచరగాడిద అంటే మగ గాడిదకు, ఆడ గుర్రానికి పుట్టిన సంతానం. దీని తల్లిదీనికి సంతానోత్పత్తిని చేసే సామర్ధ్యం ఉండదు.)

ఇప్పుడు మరళా మనం చెప్పుకుంటున్న అతి నిదానమైన క్రమక్రమ మార్పుల విషయంలోకి వద్దాం. 
మీరు "హోమో సేపియన్స్", మీ 4,000 తరాల క్రితపు పూర్వీకుడు మాత్రం "హోమో సేపియన్స్". 
అయినప్పటికీ ఏ "హోమో ఎరక్టస్" కూడా ఉన్నట్టుండి ఒక "హోమో సేపియన్స్"కు జన్మనివ్వటం అనేది జరగదు.

కాబట్టి ,"మొదటి మానవుడు ఎవరు? అతడెప్పుడు జీవించాడు?" అనే ప్రశ్నలకు "ఖచ్చితమైన" సమాధానం ఉండదు. 
ఈ విషయం "నువ్వు పొత్తిళ్ళలోని శిశువు నుండి చంటి బిడ్డగా ఎప్పుడు మారటం జరిగింది?' అనే అస్పష్టమైన ప్రశ్నలాంటిది. 
బహుసా ఒక లక్ష సంవత్సరాలకు క్రితం నుండి పది లక్షల సంవత్సరాల క్రితంలోపు ఉన్న మన పూర్వీకులు, నేటి ఆధునిక మానవులతో కలిసి సంతానోత్పత్తి చేయటానికి వీలు లేనంతగా మనతో వ్యత్యాసం కలిగి ఉన్నారు. అనగా ఆ కాలంలోని మన పూర్వీకులను మన ప్రజాతికి చెందిన వారు కాదు అని గుర్తించాలి.

పుస్తకాల అర వెంబడే నడుస్తూ కాలంలో ఇంకా వెనక్కు వెళ్తూ ఉంటే, అంటే ఒక 60లక్షల సంవత్సరాల వెనక్కు వెళ్తే అప్పుడు మీ 2.50 లక్షల తరాల క్రితపు పూర్వీకుడు ఆఫ్రికాలో ఉంటాడు. అదొక "ఏప్" (తోకలేని కోతి) చింపాంజీని పోలి ఉన్నా చింపాంజీ కాదు, బదులుగా మనకు చింపాంజీలకు అతడు ఉమ్మడి పూర్వీకుడు.

2 కోట్ల 50 లక్షల సంవత్సరాల వెనక్కి వెళ్తే ఉండేది 15 లక్షల తరాల క్రితపు పూర్వీకుడు, అది "ఏప్" కాదు. అది తోక ఉన్న కోతి. తోకలు ఉన్నాయి కాబట్టి ఏప్ అనకుండా కోతి అనవచ్చు, కాని అవి ఇప్పుడు మనకు కనపడుతున్న కోతులను పోలి ఉండవు.

6 కోట్ల 30 లక్షల సంవత్సరాల వెనక్కి వెళ్తే ఉండేది 70 లక్షల తరాల క్రితపు పూర్వీకుడు, అది "లీమర్"ను పోలి ఉంటుంది. అది ఆధునిక లీమర్లకు, కోతులకు, ఏప్ లకు, మనకు ఉమ్మడి పూర్వీకుడు.
10 కోట్ల 50 లక్షల సంవత్సరాల వెనక్కి వెళ్తే ఉండేది 4 కోట్ల 50 లక్షల తరాల క్రితపు పూర్వీకుడు, అది అన్ని ప్రజాతుల క్షీరదాలకు ఉమ్మడి పూర్వీకుడు. (ఆస్ట్రేలియాలోని మార్సుపియల్స్ మరియు అమెరికాలలోని కొన్నిటికి తప్ప)
31 కోట్ల సంవత్సరాల వెనక్కి వెళ్తే ఉండేది 17 కోట్ల తరాల క్రితపు పూర్వీకుడు, అది ఒక బల్లిని పోలి ఉంటుంది. తానే అన్ని క్షీరదాలకు, సరీసృపాలకు, పక్షులకు బృహత్తరమైన ఉమ్మడి పూర్వీకుడు.
34 కోట్ల సంవత్సరాల వెనక్కి వెళ్తే ఉండేది 17 కోట్ల 50 లక్షల తరాల క్రితపు పూర్వీకుడు, అది ఒక సాలమండర్ని పోలి ఉంటుంది. తానే ఉభయ చరాలకూ, భూమి మీద ఉండే అన్ని సకశేరుకాలకు (వెన్నెముక గల జీవులు) ఉమ్మడి పూర్వీకుడు.
చివరిగా మీరు ఆ పుస్తకాల అర అవతలి వైపుకు చేరితే అది కాలగమనంలో అది 41 కోట్ల 70 లక్షల సంవత్సరాల వెనక్కి వెళ్ళినట్లు. అప్పుడు ఉండేది 18కోట్ల 50లక్షల తరాల క్రితపు పూర్వీకుడు. అది చేప. మీరు అక్కడి నుండి కాలంలోకి ఇంకా వెనక్కి వెళ్తే రకరకాల దవడలు కలిగిన చేపలు, దవడలే లేని చేపలు ఇలా ఆ క్రమం సాగుతూ ఉంటుంది.

(విషయం మరియు చిత్రాల సేకరణ - 
"మాజిక్ ఆఫ్ రియాలిటీ" గ్రంధం, రచయిత: రిచర్డ్ డాకిన్స్, చిత్రకారుడు: డేవ్ మెక్ కీన్ )

Hariprasad K 🖊️

Comments

Popular posts from this blog

The Serpent Stone Sanctum of Nallagutta - A Geospiritual Revelation

𝘼𝙗𝙤𝙪𝙩 𝙈𝙮 𝘽𝙡𝙤𝙜𝙜𝙚𝙧

𝗧𝗵𝗲 𝗛𝗼𝘆𝘀𝗮𝗹𝗮𝘀 𝗮𝗻𝗱 𝗧𝗵𝗲𝗶𝗿 𝗠𝗮𝘀𝘁𝗲𝗿𝘆 𝗼𝗳 𝗦𝗼𝗮𝗽𝘀𝘁𝗼𝗻𝗲: 𝗔 𝗖𝗼𝗻𝗳𝗹𝘂𝗲𝗻𝗰𝗲 𝗼𝗳 𝗚𝗲𝗼𝗹𝗼𝗴𝘆 𝗮𝗻𝗱 𝗔𝗿𝗰𝗵𝗶𝘁𝗲𝗰𝘁𝘂𝗿𝗮𝗹 𝗘𝗻𝗴𝗶𝗻𝗲𝗲𝗿𝗶𝗻𝗴